SHOP   
languages languagesicone
site loader

kusuma Harathi

కుసుమ హారతి

              పూలతో పూజించడం , ఆభినందనలు తెల్పడం , నివాళులు అర్పించడం  ప్రపంచానికి అలవాటైతే ,పూలనే పూజించడం తెలంగాణా ప్రజల ప్రత్యేకత.ప్రకృతి ఆరాధనే మనం జరుపుకునే బతుకమ్మ పండుగ.  ప్రకృతినుంచి సేకరించిన పూలను మళ్ళీ ఆ ప్రకృతికే సమర్పించడం  ఈ పండుగ అంతరార్థం.తొమ్మిది రోజుల జాతర.నేలకు దిగి వచ్చిన హరివిల్లు.

             బతుకమ్మ అంటే ఆటపాటలు ,నింగికెగసిన ఆనందోత్సాహాలు.ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు పండుగ నాటికి అంబరాన్నంటుతాయి.

                 బతుకమ్మ పండుగ ఎన్నో కళల సమాహారం.బతుకమ్మను పేర్చడమే ఓ కళ .స్త్రీల సజనాత్మకతకు అందమైన చిరునామా. తంగేడు , గుమ్మడి , గునుగు , కట్ల ,  గన్నేరు ,బంతి , చామంతి , రుద్రాక్ష ,బీర   అన్నీ స్వదేశీ సంపదే . ప్రాంతీయ సువాసనలే. ఇవన్నింటితో గోపురంలా పేర్చిన బతుకమ్మ కు పైన పసుపుతో చేసిన గౌరీదేవి , పక్కల వెలిగించిన దీపం , సుగంధాలు వెదజల్లే అగరు వత్తుల ధూపం ఇదీ రూపం. తర్వాత  ఇంకేముందీ ఆటలు , పాటలు , పట్టుచీరల పరపరలు , చప్పట్లు , వెలిగిపోయే మొహాలు  ఇవన్నీ చూసి ఆనందించాల్సిందే .పాల్గొని జీవితాన్ని రసభరితం చేసుకోవాల్సిందే . అలా ఆడి , పాడి అలసిసొలసిన మనశ్శరీరాల సంతృప్తిని ఏ భావాలూ పూర్తిగా వెల్లడించలేవు.

                 ఈ పండుగ శరత్కాలంలో వస్తుంది.అప్పటికి వర్షాలు  వెనక్కు జారుకుంటే .నిర్మలఆకాశాలు  ఆరుబయటికి వచ్చి ఆనందించమంటాయి.     దసరా అంటేనే దేశమంతా దేవీపూజలు , రావణ దహనాలు , నవరాత్రుల సంరంభాలు ఇవన్నిటితోబాటు బతుకమ్మ వేడుకలు తెలంగాణా ప్రాంతానికే ఓ ప్రత్యేకతను తెచ్చిపెడతాయి.,

                     అయితే దసరా తెలంగాణాకు వచ్చేసరికి పూర్తిగా రూపం మార్చుకుని జానపద అందాల్ని సొంతం చేసుకుని , ప్రకృతి సంపదకు పట్టాభిషేకం చేస్తుంది.వినాయక చవితికు మూలికలే మహరాజులైనట్లు , బతుకమ్మలో పూలే మహరాణులు

 అసలు ఈ పండుగ  వయసుతో సంబంధం లేకుండా  కుల ,వర్గ , జాతి , ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరినీ కలుపుకుని హుషారెత్తిస్తుంది.

                     ఏముందీ నాలుగురకాల పూలను తెచ్చి అలా పళ్ళెంలో పెట్టేస్తే చాలనుకోకండి . అదో కళ . అనుభవం మీద అబ్బే పనితనం . నీళ్లల్లో వదిలినప్పుడు విచ్చిపోకూడదు . పళ్లెంలో పేర్చిన బతుకమ్మను జాగ్రత్తగా  కదిలిపోకుండా , విడిపోకుండా క్రింది పళ్ళెం ఒడుపుగా జరిపి నీల్లల్లోకి జారవిడుస్తారు .అలా నీళ్లల్లో సాగిపోతుంటే మొహాల్లో కనిపించే పట్టరాని సంతోషం చూసి తీరవలసిందే .

                   మా చిన్నప్పుడు వాకిట్లో కాస్సేపు , వీధి మధ్యలో ఇంకాస్సేపు , పుష్కరిణి దగ్గర  చాలాసేపు  ఆడి ,ఇంటికి తిరిగి వచ్చేవాళ్లం. అక్కడితో అయిపోయిందా  లేదుగా . తిరిగొచ్చాక విశాలంగా ఉన్న వీధిలో  లేదా ఎవరింట్లోనో కోలాటం వేసేవాళ్ళం.ఎవరూ నేర్పలేదు .చూసి నేర్చుకోవడమే.ఆట లేని బతుకమ్మ అసంపూర్ణమే.అన్నీ అజ్ఞాత కర్తృకాలే.పాడుతూ , చప్పట్లు కొడుతూ వలయాకారంగా తిరుగుతూంటే , ఆ ఊపులో కొందరు మరిన్ని చరణాలను ఆశువుగా అందుకుంటారు.అలా తలా ఓ చెయ్యిపడి పాట నవరసభరితమౌతుంది .

                 ఈ పాటలకు విషయమెక్కడిది కథలెవరివి అని అడక్కండి.నిత్యజీవిత అనుభవాలు , పెద్దల సూక్తులు , వారి కష్టాలు ,కన్నీళ్ళు , వేడుకలు , పండుగలు , నోములు , ఊహలు , కోరికలు ఒకటేమిటి జానపద జీవన సర్వస్వం వాటిలో అందంగా , హృద్యంగా దూరిపోతాయి.ప్రతిపాదం చివర సాధారణంగా ఉయ్యాల  , కోల్ కోల్ ,సందమామా వంటి ఊతపదాలు ఆడేవారికి , పాడేవారికేగాక చూసేవారికీ ఉత్సాహాన్నిస్తాయి.దారిన వెళ్తున్న వాళ్లనీ ఓ రెండు చుట్లు ఆడి వెళ్దాం అనుకునేలా చేస్తాయి.  చప్పట్లే వీటికి వాద్య సహకారం.తేలిక పదాలు , సులువైన వరుసలు,అందమైన ఊహలు ,విలువైన ,అపురూపమైన అచ్చ తెలుగు పదబంధాలు వీటికి చెరిగిపోని గుర్తులు .

              పండుగలు జనజీవితాల్లోకి చొచ్చుకొనిపోయి , నిత్యనూతనంగా మనసులను రంజింపజేస్తాయనడానికి ఇంతకంటె గొప్ప ఉదాహరణ ఇంకెక్కడుంది  అసలు బతుకమ్మ వేడుకలను కాస్త గమనించండి.ప్రాంతీయతా పొలిమేరలను దాటి ,భారతీయతకు సంకేతంలా కన్పించడం లేదూ.అందులో వాడే ప్రతి పూవుకూ ఓ ప్రత్యేక లక్షణముంది.దాన్ని కాపాడుకుంటూ ,పదిమందితో కలిసి ,ఒక్కటై నిలిచిపోవడం భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయాన్ని గుర్తుచేయడం లేదూ.అంతేకాదు నా దృష్టిలో బతుకమ్మ అంటే బతుకవే అమ్మా అనే అర్థం తోబాటు నీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ , నలుగురితో కలిసి బ్రతుకు అని. మీరేమంటారు

తొలిపలుకు

తన భావాలను ఎదుటివారికి తెలియజేయడానికి, ఎదుటివారు చెప్పింది అవగాహన చేసుకోడానికి  మనిషి ఏర్పాటు చేసుకున్న ప్రక్రియే భాష. అయితే ఇది రెండువైపులా పదునైన కత్తిలాంటిది. మాట ఎంత క్లుప్తంగా,అర్థవంతంగా ,అందంగా , వినసొంపుగాఉంటే అంత శక్తివంతమౌతుంది. మాటకున్న శక్తి అనంతం. అది జాతికి ఊపిరిపోస్తుంది. మండుతున్న హృదయాలకు చందనమౌతుంది. దేశాన్ని జాగరితం చేస్తుంది. ఆవేశాలను రెచ్చగొడుతుంది. మొగలిరేకులా గుచ్చుతుంది. మల్లెలా సుగంధాలను వెదజల్లుతూ , ప్రశాంతతనిస్తుంది. ఒక్కోసారి సహనానికి పరీక్షపెడితే , కొన్నసార్లు హృదయాన్ని కదిలిస్తుంది.

ఎవని మాటలు ముత్యాలమూటలో ,ఎవని మాటలు వినే వాళ్ళను ఆకట్టుకుంటాయో , ఎవడు తక్కువ మాటలతో ఎక్కువ భావాలను అందివ్వగలుగుతాడో వాడే విజేత. జనం గుండెల్లో గుడి కట్టేస్తాడు.

ఈ చిన్న జీవితం నిండా కాస్త ప్రేమని, కొంచం నమ్మకాన్ని, మరికాస్త కరుణను నింపండి. లోకం అందమైన హరివిల్లులా మారిపోతుంది. మీరు ఆందోళనలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, సందిగ్ధంలో ధృఢచిత్తాన్నీ , నిరాశలో ఉత్సాహాన్ని నింపాలనీ మీకో మంచి నేస్తంలా మీముందుకొస్తోంది మితభాషి.

ఇందులో మీ మనసులోతులను తడిమేవీ , ఆశ్చర్యపరిచేవీ, ఆనందింపజేసేవీ, తెలిసినవీ, తెలుసుకోవాల్సినవీ, గుర్తుచేసుకోవాల్సినవీ , ఎప్పుడోజరిగినవీ , మనసుపొరల్లో దాగినవీ అన్నీ కలిసి ఉగాది పచ్చడిలా శుచిగా , రుచిగా  పండుగభోజనంలా వచ్చేసింది.

ఏముంటాయి మితభాషిలో అని కదా మీ సందేహం

నేను కన్నవీ , విన్నవీ , తెలుసుకున్నవీ ,రాసినవీ , నచ్చినవీ , సేకరించినవీ , చెప్పాలనుకున్నవీ అందించే పంచవన్నెల రామచిలుకలాంటిది  మితభాషి.

చదవండి . చదివించండి . మితభాషిని ప్రోత్సహించండి.

 మితభాషి

Teluguaudionovels.com

పేరంటాలు

                 పెళ్లి , వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో  మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి  పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం  వచ్చింది.    దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో  భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను  కూడా తెలుసుకోవాలి గదా.క్లుప్తంగా  సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ  ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని  అంటారు.

     సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ  దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన. పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో, ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.

       భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు  బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్  వర్ణించారు.

              కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో  సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.

                సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని  కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో  ఇరువైపుల బంధువులు (  ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు. దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని  కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.

               ఈ సంప్రదాయం  మరో రూపంలో రసపుత్రులలో  ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.

             19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

          నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో  చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు. ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి  అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట. ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి  ప్రదేశంలో కూతురికొక్క గుడి కట్టించింది.

             ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో  అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను  సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా  లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.

               మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట  అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ (  1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ  ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు  పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి.వాస్తవాలు,విశ్వాసాలు పాలు,వీళ్లలా కలిసిపోయాయి.

             ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చార్త్రకక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలను అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.

అందమైన జీవితం

                 మన జీవితం ఒక అందమైన వరం.అరుదైన అవకాశం .దాన్ని సంపూర్ణంగా,అర్థవంతంగా,ఉపయోగకరంగా జీవించడం తెలుసుకోవాలి.అలవాటు చేసుకోవాలి. మన అలోచనలే మనం.మన ఆలోచనల నాణ్యతే జీవితం పట్ల మన ప్రవర్తనను,వైఖరిని,భావోద్వేగాలను  నియంత్రించి,వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.

               అందరికీ పదిమందిలో మెప్పు పొందాలని,గుర్తింపు తెచ్చుకోవాలనీ ఉంటుంది. దాంతోబాటే అలా గుర్తింపు తెచ్చుకున్న నలుగురూ తనను గుర్తించాలనీ ఉంటుంది. ఆకర్షణీయమైన వ్యక్తులను ఆకర్షించాలంటే ,మనం ఆకర్షణీయమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. అది బాహ్య అలంకారాలకు సంబంధించిందని అనుకోకండి.అది తాత్కాలికమే. మన వ్యక్తిత్వంతో ఆకట్టుకోగల గాలి.అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి.

                       మనిషిగా మనకు మనమే జవాబుదారీ.మనకు మనమే తీర్పరులం.ఎవరో వచ్చి నువ్వు ఇదీ అని చెప్పరు. మన బలాబలాలను మనమే తేల్చుకోవాలి. ఈ ప్రపంచానికి నీతో ఏదో ఉపయోగం ఉండే వుంటుంది.అదేంటో అన్వేషించాల్సింది నీవే.

              అయితే  గమ్యం వేరు.కల వేరు.కల కమ్మగా వుంటుంది.గమ్యం కఠినంగా వుంటుంది. ప్రతివాడూ ఓ గమ్యాన్ని నిర్దుష్టంగా నిర్ణయించుకోవాలి.ఈ సందర్భంలో చాలామంది చేసే పొరపాటు ఒకటుంది. వారి అభిరుచులకు అనుగుణంగా గమ్యాలను ఎంచుకుంటారు. తప్పు కాదు కానీ,గమ్యాలకు అనుగుణంగా  అభిరుచులను ఎంచుకునేవాళ్ళు మరింత ఎదుగుతారు. పదిమందికీ ప్రేరణగా నిలుస్తారు.

          నిన్ను నువ్వు ఇలా మలచుకునే క్రమంలో విరోధులు విసిరే ప్రతిరాయీ నీ ఆశయానికి పునాదిరాయౌతుంది. నిన్ను రాటుదేలుస్తుంది.ఈ సందర్బంలో గుర్తుంచుకోవలసిన విషయమొకటుంది. జ్ఞానం  అంటే అహంతో ఎదుటివారి ముందు తెలివిని ప్రదర్శించడం కాదు.ఎదుటివారిని చిన్నబుచ్చడం మూర్ఖత్వం.దాంతో ఆ సందర్భంలో వాదనలో గెలుస్తావేమో కాని,అనుబంధానికి దూరమౌతావు.

                కనుక మనం , ఎన్ని  సాధించినా , ఎంత సంపాదించినా అనుక్షణం మన మీద మనకు నిఘా వుండాలి.తానేం చేస్తున్నాడో,ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడమే పరిణితి.దాన్ని సాధించడమే మంచి వ్యక్తిత్వానికి కొలమానం.దానర్థం మనిషి, మనీషి గా ఎదగడమె.