సంభాషణ అనేది ఒక కళ.దానికి కొన్ని నియమాలు,సిధ్ధాంతాలు ఉంటాయని తెలీకున్నా మీకంటూ ఓ ప్రత్యేక మైన విధానముండాలి. అది మీ మనస్తత్వానికి దగ్గరగా వుండాలి. ఎవరో కొద్దిమందికి మాత్రమే ఆసక్తి కలిగించేలా సంభాషణను కొనసాగించే నైపుణ్యం జన్మతః వస్తుంది.
తెలివితేటలు బాగావుండి,చదువుసంధ్యలున్నవాళ్లు కూడా నలుగురితో మాట్లాడటానికి జంకుతుంటారు.వారిలో తెలిసిన విషయాలెన్నోవుంటాయి.కాని అవి బయటికి రాకుంటే వారో ఆసక్తి కలిగించే వ్యక్తి యని తెలిసే అవకాశమేలేదు.
ఇక్కడొక పొరపాటు జరుగుతున్నది సాధారణంగా.పొరపాటు ఎందుకంటే కావాలని చేసేది కాదు.నలుగురున్నప్పుడు ఎవరో ఒకరిని గురించి అసందర్భంగా మాట్లాడ్డం.నలుగురిలో వున్నప్పుడు ప్రత్యేకమైన,వ్యక్తిగతమైన విషయాలగురించి మాట్లాడకూడదు.ఎదుటివారి ఆసక్తులను దృష్టిలో వుంచుకోవాలి.
మరో సమస్య ఒకరే ఎక్కువగా మాట్లాడడం.అలా ఆగకుండా,ఆపకుండా ఎదుటివాళ్లని నోరెత్తనివ్వకుండా మాట్లాడటం బావోదు.ఉరికే జలపాతంలో మాట్లాడుతుంటే ఏ గరికపాటో,చాగంటో,సామవేదమో అయితే బావుంటుంది గానీ మన మాటలు అంత రసవత్తరంగా ఉండవుగా.
ఇందులో కాలేజీ పిల్లలని కలపకండి.వాళ్ళ ప్రపంచమే వేరు.మనవాళ్ళు కలిస్తే,వాతావరణం,ఇంట్లో ఇబ్బందులు,రోగాలు-రొష్టులూ,సినిమాలు,రాజకీయాలు వీటి గురించే మాట్లాడుకుంటారు. ఇందులోనూ ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్లు కలిస్తే ఆఫీస్ రాజకీయాలు చర్చిచడం తప్పనిసరి వ్యాపకం.
బాగా మాట్లాడాలని కోరికుంటే ఏదైనా కొత్తది,ఆసక్తికరమైంది,యోగ్యమైనది( అప్పటికి తగినది) గురించి మాట్లాడటం అలవాటు చేసుకుంటే తక్కువ సమయంలోనే మంచి సంభాషణా చతురుడుగా గౌరవాన్ని పొందడమే గాక ఆసక్తికర వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలడు.
కొంతమంది నాయకులు పదవులకై ఎన్నోవాగ్దానాలు చేస్తుంటారు.వాటిని బలపరచడానికి నానా చెత్తా మాట్లాడాల్సివుంటుంది.కొన్ని విషయాలు పదిమందికీ తెలియజేయాలి.కొన్నిటిపై ప్రతిస్పందించాలి.కాబట్టి వారి వైఖరి,విధానాల ద్వారా దానికి మరిన్ని హంగులను జేర్చి ప్రజల్ని,అధికారుల్ని,ప్రభుత్వాలన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు.
ఏతావాతా తేలిందేమిటంటే సంభాషణా చతురులు కావాలంటే చుట్టూ జరిగే విషయాల గురించి,చదవాలి,వినాలి,తెలుసుకోవాలి.గమనించాలి.లోక సరళిని గురించి,ఆచారవ్యవహారాలను గురించి కాస్తయినా తెలిసుండాలి. మీరు మాట్లాడే అంశంపై మరింత లోతైన అవగాహన వుండాలి.ఉపన్యాసాలను ఇవ్వాలంటే ఈ అంశాలు చాలా ఉపయేగపడతాయి. రేడియో,టి వి లలో ప్రసారమయ్యే కార్యక్రమాలను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే చాలా అంశాల పట్ల ప్రాథమిక అవగాహన వచ్చేస్తుంది.సాంఘిక,ఉద్యోగ,వ్యాపార రంగాలలో రాణించాలంటే లోకజ్ఞాన పరిధిని, depth ని పంచుకోక తప్పదు.
ఇవన్నీ ఏర్పరచుకున్నాక , ఆలోచించాల్సిన విషయం మరోటుంది.మీ మాట తీరు కనుక దురుసుగా,అసహనంగా వున్నట్లయితే ఇప్పటిదాకా చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోతుంది.సంఘంలో మీరో గుర్తింపు సంపాదించుకోవాలనే కోరిక తీరదు.
మరికొందరు తమకు తెలివితేటలు లేవని ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ , దాన్ని కప్పిపుచ్చుకోడానికి నేనిలాగే వుంటాను.ఎవరికోసమో మారాల్సిన అవసరం నాకు లేదని వాదిస్తుంటారు. దీంతో వీరు మారకున్నా ఇతరులు మారి వీరికి దూరంగా జరిగిపోతారు.దీనర్థం గుడ్డిగా,మందలో గొర్రెగా వుండమని కాదు.మీ వ్యక్తిత్వం కోల్పోకుండా, అదే సమయంలో ఎదుటివారిని నొప్పించకుండా మీ అభిప్రాయాలను తెలియజేసే నైపుణ్యాన్ని పెంచుకోండి.మనం ఎవరితోనూ కలవకుండా , ఏకీభవించకుండా ఎక్కువ కాలం బ్రతకలేము.
మీ మనస్సును చురుకుగా వుంచుకోండి.దానికోసం ఓ గమ్యాన్ని ఏర్పరచుకోండి.ఓ హాబీనో,తోటపనినో , రచనావ్యాసంగాన్నో,మంచి పుస్తకాలను చదవడమో,వినడమో మీ దినచర్యలో ఓ భాగంగా చేసుకోండి.మీరు మరింత ఆసక్తికర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలంటే జీవితం పట్లా,జరుగుతున్న పరిణామాల పట్లా విశాలదృక్పథాన్ని అలవరచుకోడం తప్పనిసరి.ప్రజాదరణకు అడ్డుదోవలుండవు.ఉన్న కాసినీ అన్ని వేళలా పనిచేయవు.లోకం మీకోసం మారదు.లోకంలో ఉండాలంటే మీరే మారాలి.
మీ వ్యక్తిత్వాన్ని,లోకరీతినీ బాలెన్స్ చేసుకోవడమే నిజమైన వ్యక్తిత్వవికాసం.దాన్ని సాధించడమే మన ప్రయాణాన్ని సుగమం చేసి గమ్యాన్ని చేరుస్తుంది.