ఎదుగుదల
అక్షరాస్యతా ఉద్యమం అంటే అక్షరాలు నేర్చుకుని వదిలేయడం కాదు. వాటిని ప్రేమించడం, చదవడం తద్వారా ఎదగడం.
వ్యక్తిత్వం
పొదుపుగా,సూటిగా తక్కువమాటలతో చెప్పే విషయానికున్న శక్తి అపారం. దాన్ని సాధించడమే సిసలైన వ్యక్తిత్వం.
అవకాశం
అవకాశాలేవీ వచ్చీరావడమే గొప్పగా రావు .కొంతదూరం వాటి వెంటబడి నడిచాకే అవి గొప్పవో , కావో తెలుస్తుంది. ముందునుంచే ముడుచుకుని ఉండిపోతే , వచ్చిన ఏ అవకాశమైనా చేయిజారి పోతుంది.
సమయం
పని లేని వాడికి సమయం ఆగిపోతుంది.పనిలో నిమగ్నమైన వానికి ఉన్న సమయం చాలనేచాలదు. తేడా కాలంలో లేదు.దాన్ని అర్థం చేసుకునే మనుషుల్లోనే ఉంది.అనవసరపు జ్ఞాపకాలను వదిలించుకుంటే చాలా సమయం మిగుల్చుకున్నట్లే.
సంకల్పం
జీవితంలో ఒక దశ గడిచాక ప్రాణాన్ని నిలిపేది ఆరోగ్యం కాదు.సంకల్పం.
ఈత
సరస్సులో బాతులు ఈదడం చూస్తుంటే ఎంతోఅందంగా ఉంటుంది.అయితే యీదడం కోసం అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా ,ఎంతో బలంగా కాళ్లు కదుపుతూనే ఉండాలి.అందమైన జీవితమూ అంతే
మనం
మనం మనలా ప్రవర్తించకపోవడం భావ దారిద్ర్యమే కాదు.వ్యక్తి సంహారం కూడా.చాలాసార్లు అందరికీ అన్నీ అమర్చే మనం మనకోసం ఏమీ ఇచ్చుకోలేకపోవడం నిర్లక్ష్యంకన్నా దారుణ మయిన నేరం. మనతో మనం శాంతంగా ఉంటే అందరికీ శాంతిని పంచగలం.
జీవితం
మనం జీవితాన్ని శాసించకుండా నడిచినంతకాలం సుఖంగానే బ్రతకవచ్చు. మనం విధిని ఎదిరించి,జీవనగతినిమనకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నించినప్పుడు భగవంతుని చేతి పగ్గాలను మన చేతిలోనికి తీసుకున్నప్పుడు కష్టాలు ప్రారంభమౌతాయి.కనుక జీవితం పట్ల గౌరవంతో మసలుకోవాలి. జీవితంలో వచ్చే మలుపుల్ని గౌరవించి, ఆమోదించాలి.