SHOP   
languages languagesicone
site loader

            మీరు  గమనించారా ? మన ప్రాచీన దేవాలయాలు చాలా వాటికి చుట్టూ భారీగా,ధృఢంగా కట్టిన ప్రాకారాలున్నాయి.అయితే వెయ్యి సంవత్సరాలకు పూర్వం కట్టిన చాలా ప్రాసాదాలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ఇతర దేశాల్లో చాలా సౌధాలకు రక్షణ వలయంలా కోటలు,వాటిని ఆనుకుని ప్రాకారాలున్నాయి.మన దగ్గర దీనికి వ్యతిరేక పరిస్తితి వున్నది.గమనిస్తే ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది.

            కేరళ లోని కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూ రికార్డ్ లను పరిశీలిస్తే కొన్ని వివరాలు తెలిసాయి.ఆ రికార్డ్ లు అన్నీ కంచు ఫలకాలపై రాసి(  చెక్కి )   ఉన్నాయి.అందులో ఆ దేవాలయ భూమి  పండరం వాహకు చెందినవని ఉంది. మలయాళంలో పండరం అంటే భండారం.అంటే హుండి.ఆ సమీపంలోని ఆలయంలోని దైవానికి  చెందినది ఆ భూమి అని అర్థం .

               వివరంగా తెలుసుకోవాలంటే ఆ ప్రాంతానికి  చెందిన రాజు ఆ దేవునికి సేవకుడని భావం.ఉదా కేరళ లోని తిరువనంతపురం లోని రాజును పద్మనాభుని దాసుడని సంబోధిస్తారు. ఆ గుడి పద్మనాభుని కోసమే కట్టినది.ప్రాచీన న్యాయశాస్త్రం ప్రకారం  దేవాలయం లోని మూర్తి శాశ్వతంగా మైనరే. రాజు సేవకుడే కాని యజమాని కాడు.కేవలం కొన్ని మినహాయింపులతో ఆ భూభాగమంతా ఆ దేవతదే.

              మధ్య తూర్పు,పశ్చిమ దేశాల్లో రాచకుటుంబం ఆ దేశానికి యజమానులు.

  అరబ్బులు,యురోపియన్లు మన దేశానికి వచ్చినప్పుడు హిందూ రాజులు వారిని అతిథులుగా భావించారు.మన సంప్రదాయం అతిథి దేవో భవ అన్నది కదా.అలా అప్పటి రాజులు విదేశీయులకు ఉచితంగా భూముల నిచ్చి, ప్రార్ధనాలయాలకై విరాళాలను కూడా ఇచ్చారు. పాతరికార్ఢులను తిరగేస్తే ఇలా భూముల నిచ్చిన వారిలో అధికులు హిందూరాజులే.

   ఇప్పుడు కాస్త దేవాలయ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ప్రాచీన దేవాలయాలు ప్రార్ధనలకు ఉద్దేశించినవి కావు. అందు వల్లే చాలా గుళ్లలో సామూహిక ప్రార్ధనల కోసం హాలులు లేవు.  బదులుగా స్థంభాలతో నిర్మించిన మండపాలున్నాయి.ఇవి కళా ప్రదర్శనలకు,ప్రజల సాంప్రదాయిక కార్యక్రమాల కోసమే .

       సాధారణంగా మన దేవాలయాల్లో గర్భగుడులు చిన్నవిగా,చీకటిగా వుంటాయి.కష్టంగా ఇందులో ఇద్దరో , ముగ్గురో  నిలబడగలరు.దానర్థం దేవాలయ నిర్మాణ ఉద్దేశ్యం వేరే.అవి శక్తికి నిధులు. ప్రతి వేడుక ,ఉత్సవాలు,పూజలు,ప్రార్ధనలు అన్నీ ద్వితీయ శ్రేణికి చెందినవే. ముఖ్యమైన ఉద్దేశ్యం శక్తికి నిలయమే. అది ఆ రోజుల్లో వారికెలా సాధ్యమో మనమీనాడు మన కున్న పరిమిత జ్ఞానంతో నిర్ధారంచలేము.కానీ కాలం మారింది  .ఆ ద్వితీయ శ్రేణి లోని పూజాదికాలు,వేడుకలు మనకు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి.ఆ దేవాలయాల నిజమైన ప్రాముఖ్యాన్ని ,సార్థకతను పక్కకు జరిపి ఆచారాలు,ఆడంబరాల పేరుతో అసలైన అర్థానికి దూరంగా,బహుదూరంగా జరిగిపోయాము.

             దేవాలయాలు అపార నిథులకు నెలవులు.అందుకే అంతంత పెద్ద రక్షణ వ్యవస్థను ఏర్పరచారేమో.ఈ మధ్య కాలంలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో అనంత సంపదలు న్నట్లు ప్రపంచానికి వెల్లడైయింది కదా.అయితే దేవాలయ నిధులన్నా ధర్మకార్యాలకే వినియోగించేవారు.

                    గుడిలోని పూజారికూడా సేవకుడే.అతనికీ దేవుని సంపదపై అధికారం లేదు.నిరాశ్రయులకు,దీనులకు ,ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులకు ప్రసాదం , వసతి ఏర్పాట్లుండేవి.చేసే ప్రతిపనినీ రామార్పణో,కృష్ణార్పణనో,ఈశ్వరార్పణమో అనుకుంటూ చేసేవారు. ప్రతివారి కష్ట సుఖాల్లో దేవాలయవ్యవస్థ మూలస్థంభంగా నిలిచేది.అక్కున జేర్చి .కన్నీళ్లు తుడిచేది.

                   అదే మన ప్రాచీన  ఆర్థిక వ్యవస్థ.ఇతరులతో మనకున్న దాన్ని పంచుకోవడం మన ధర్మంగా భావించేవారు.పూర్వులు శక్తికి,జ్ఞానానికి అపారమైన విలువనిచ్చివాటికి భాండాగారాలను   ఏర్పాటుచేసారు.గ్రంథాలయాలను,విశ్వవిద్యాలయాలను దేవాలయాల్లో,వాటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు.ప్రతీదీ చాలా కష్టపడి సముపార్జించి, ముందుతరాల కోసం భద్రపరిచారు.

        ఇంతేనా మన దేవాలయాలు అపురూప భవన నిర్మాణ కళకు,అద్భుతశిల్పకళకు నిలయాలు.అది వైభవోజ్వల భారతం.ఆ శిల్ప సౌందర్యాన్ని గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

                 ఆ తర్వాతి కాలంలో జరిగిన విషయాలను మీరు చదివివుంటారు.వినిఉంటారు.చరిత్ర కారుల అభిప్రాయంలో దాదాపు లక్ష వరకు దేవాలయాలు ధ్వంసమైనాయి. విదేశీ దురాక్రమణలో ధర్మాన్ని మార్చుకోవడం ఇష్టపడక ,లక్షలాది హిందువులు ప్రాణాలు వదిలారు.అంటే మన పూర్వులు.దేవాలయాలను,ఆస్తులను కొల్లగొట్టడంతో సరిపెట్టుకోక మన అపూర్వ గ్రంధాలను,విశ్వవిద్యాలయాలను కొల్లగొట్టారు.కాల్చారు.కూల్చారు.అదంతా గతం.

                    కానీ నేడు రాజకీయ నాయకులు వాటి చాటున ,వాటిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నారు.ధర్మకర్తల మనే పేరు మీద దేవుని ఆస్థులను కైంకర్యం చేస్తున్నారు.శ్రీరంగనీతులను నోటితో ఉచ్చరిస్తూ, దేవుని మాన్యాలను యథేఛ్చగా భోంచేస్తున్నారు, ఎదుగుతున్నారు..నేడు ప్రజలు భయపడుతున్నది దేవునికి కాదు,రాజకీయనాయకులకు,వారి అనుచర గణానికి. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ సంస్కృతి  నశించక తప్పదు.సుదీర్ఘ పోరాటంఅనంతరం రామజన్మ భూమి అంశం పరిష్కారమైనది.త్వరలోనే అన్యాక్రాంతమైన దేవుని ఆస్థులకు విముక్తి కలగాలని మనసారా ప్రార్థిద్దాము.

Leave a Reply

Your email address will not be published.