SHOP   
languages languagesicone
site loader
October 14, 2020 మంచి వక్త కావాలంటే

              వక్తృత్వం ఒక కళ. ఒక విద్య. శ్రధ్ధతో , సాధనతో అలవడే కళల్లో ఇదీ ఒకటి. ప్రతిమనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్దీపితమైనప్పుడు అతడు వక్త అవుతాడు. తనలోని భావాలను శక్తివంతంగా ప్రసారం చేయడానికి రహదారి వక్తృత్వం .జీవితంలో వాక్ శక్తి నిర్వహించే పాత్ర అమోఘమైనది. దేశాన్ని, సంఘాన్ని కలవరపెట్టే సమస్యలకు తాను పరిష్కారం  చూపాలనుకున్నప్పుడు మౌనం కంటే భాషణం మంచిసాధనం.

             వక్తృత్వ శక్తి వైయుక్తిక ప్రయోజనాలకే గాక సామాజిక ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది . భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా టుంది. మాట్లాడగలగడం అందులో ఒకటి. మాట ఎంత క్లుప్తంగా, ఎంత అర్ధవంతంగా , ఎంత అందంగా , ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమౌతుంది. మాట జాతిని జాగరితం చేస్తుంది. మండుతున్న కోపాన్ని ఆర్పుతుంది. దైర్యాన్నిస్తుంది. ప్రోత్సహిస్తుంది. బంధాన్నిదూరం చేస్తుంది. నిందవేస్తుంది. నిద్ర పట్టకండా చేస్తుంది.

                   ఈ కళలో ఎవరైనా నేర్పు సంపాదించవచ్చు.భవిష్యత్తుకు బంగారు బాటలను వేసుకోవచ్చు.అందరి వాక్కులో అద్భుత శక్తి ఉంది. నిరంతర ప్రయత్నం వల్ల ఈ కళలో కౌశలాన్ని సంపాదించుకోవచ్చు. దీనికెంత శక్తి ఉందో మీకు నిత్యజీవితంలో అనేక ఉదాహరణలు అడుగడుగునా కన్పిస్తూనే ఉంటాయి. సాధువులు, ఫకీరులు, L I C ఏజెంట్లు , సేల్స్ రిప్రజంటేటివులు  …వాళ్ల మాటలగారడీలో పడొద్దనుకుని పడిపోతుంటాము. నిరక్షరాస్యులైన వాళ్ళు ఎందరో  మనల్ని  మాటల్తోబురిడీ కొట్టిస్తుంటారు.

                  అయితే బాగా చదువుకున్నవాళ్ళు చాలామంది స్టేజి ఎక్కడానికి భయపడుతుంటారు. చలిజ్వరం వచ్చివానిలా  వణికిపోతుంటారు. భయాన్నీ, అనుమానాన్నీ వదులుకుంటే మీరూ మంచి వక్తగా మారగలరు.అలా మారడానికి మీకీ రోజు కొన్నిచిట్కాలను గుర్తు చేస్తాను.

   మొదటిది      మీరు మీరుగానే ఉండండి

                వేదికల మీద అనర్గళంగా మాట్లాడే వారిని చూస్తుంటే ఆరాధన గా అనిపిస్తుంది . నిజమే కానీ మీరో మంచి వక్త కావాలంటే మీదైన ఒక ప్రత్యేక విధానాన్ని అలవరచుకోవలసిందే. కొందరు  పెట్టే సంతకాలను గమనించండి . పేరు ఒకటే అయినా ఆ సంతకం ఒక్కొక్కరిదీ ఒక్కో విధంగా టుంది. అది వారి వ్యక్తిత్వలక్షణం. అలాగే మీదైన శైలి కోసం ప్రయత్నించండి.

రెండవది        నిర్భయంగా మాట్లాడండి

               మీరు చెప్పే అభిప్రాయాల పట్ల మీకు విశ్వాసముండాలి. మీకే సందేహాలుంటే  అవి మీ గొంతులో ప్రతిఫలిస్తాయి. ఇవ్వాల్సిన ఫలితాలనివ్వవు. కాబట్టి మాట్లాడాల్సిన అంశం పట్ల  విషయసేకరణ చేయండి. తయారు చేసుకున్న ఉపన్యాసాన్ని ఒకటికి  పదిసార్లు ప్రాక్టీస్ చేయండి.మీ దృక్పథాన్ని అందరిముందూ పెట్టే అధికారం మీకుందని తెలుసుకోండి. సంకోచాలను మాని ముందుకు అడుగేయండి.

మూడవది       విభిన్నంగా మాట్లాడండి

              మీకు నచ్చిన వారి ప్రసంగాలను పరిశీలించండి. రాజకీయనాయకులైనా , ప్రవచన కారులైనా  ఎవరికైనా సరే . ప్రతివారికీ ఓ ప్రత్యేకమైన బాణీ టుంది. వక్తల మధ్య కూడా విషయం ఒకటే అయినా చెప్పే విధానం వేరువేరుగా ఉంటుంది. మీరు కూడా విభిన్నంగా మాట్లాడటానికి ప్రయత్నించండి .క్రమంగా మీకో ప్రత్యేకతనేర్పరచుకోండి. ఏ విషయమైనా మీ దృక్పథంలోనే మాట్లాడండి.వైవిధ్యం దానంతటదే వస్తుంది.

నాల్గవది    ప్రసంగంలో హాస్యాన్ని చేర్చండి.

                మీరు మాట్లాడాలనుకున్న విషయం ఎంత గంభీరమైనదైనా దానిక్కాస్త హాస్యాన్ని జోడించండి. ఎదుటివారి మనస్సుకు దగ్గరవ్వాలంటే  అంతర్లీనంగా హాస్యపు  రేఖలుండాలి. బంగారు పళ్ళెరానికైనా గోడచేర్పు కావాలిగదా. అలానే హాస్యాన్ని రంగరించిన ఉపన్యాసం మదిలో నిలిచిపోతుంది.

ఐదవది  పాజిటివ్ గా మాట్లాడండి

                మాట్లాడే విషయమేదైనా సందర్భానుసారంగా సానుకూల దృక్పథాన్నిజోడించండి. శ్రోతలెప్పుడూ తమకు నచ్చే ,అంగీకరించే అంశాలనే శ్రధ్ధగా వింటారు. గొప్ప శ్రోతగా ఎదగాలంటే వారికి నచ్చేలా మాట్లాడండి. చాకచక్యంగా మాట్లాడితే నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్ గా మార్చి,శ్రోతలను మెప్పించొచ్చు.

              ఇంకా సందేహముంటే ప్రతిపక్షనాయకుల ప్రసంగాలను వినండి. ప్రభుత్వం చెప్పే ప్రతిమాటలోనూ వారికి లొసుగులే కన్పిస్తాయి. అలా ప్రజలకు  దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటారు.

               ప్రజల మనఃప్రవృత్తులను  అర్థం చేసుకుని సహృదయంతో చేసిన ఉపన్యాసంలో ఆవేశం కట్టలు తెంచుకుని పారుతుంది. అగ్ని పర్వతాలు ప్రజ్వలిస్తాయి. కార్యోన్ముకులౌతారు. ఆలాంటి ఉపనాయసం ప్రజాహృదయాలలో నిలిచిపోతుంది. చరిత్రగా మిగిలిపోతుంది.

              ధృతరాష్ట్రుని కొలువులో శ్రీ కృష్ణుని చెప్పిన మాటలు, విశ్వమత సభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం,  పెటిస్ బర్గ్ లో అబ్రహం లింకన్ చేసిన ఉపన్యాసం ఇవన్నీ అలాంటివే.స్వా తంత్ర్య సమరంలో నెహ్రూ , గాంధీ, బిపిన్ చంద్ర పాల్, మౌలానా ఆజాద్, సుభాస్ చంద్రబోస్ చెప్పిన ప్రసంగాలు ప్రజలను కులమత,ప్రాంత బేధాలకు అతీతంగా స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు నడిపించాయి.

              ఆధునిక కాలంలోమాజీ రాష్ట్రపతి కలాంగారు,  ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు, లాల్ కృష్ణ అద్వానీ గారు  తెలుగుతేజం పి.వి నరసింహారావుగారు , మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు,  ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు,   మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డగారు ,సినారాయణరెట్టిగారు,, సభాసామ్రాట్ భాస్కరరావుగారు వీరి ఉపన్యాసాలు ఔత్సాహికులకు  అధ్యయన గ్రంథాలు. అపార వైదుష్యం, ఆ పై సరస్వతీ కటాక్షం  వీరి సొంతం. విషయ సేకరణ,వివరణ, విచక్షణ

వీరి ప్రత్యేకతలు.

   నిరంతర సద్గ్రంథ పఠనం, సజ్జనస్నేహం ,ఉత్తమ భావ ప్రకటనాభిలాష మంచి ఉపన్యాసకర్తకు పెట్టని ఆభరణాలు.నేర్వండి.పదిమందికి మార్గదర్శిగా మారండి.

Leave a Reply

Your email address will not be published.