SHOP   
languages languagesicone
site loader

                 పెళ్లి , వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో  మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి  పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం  వచ్చింది.    దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో  భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను  కూడా తెలుసుకోవాలి గదా.క్లుప్తంగా  సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ  ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని  అంటారు.

     సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ  దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన. పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో, ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.

       భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు  బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్  వర్ణించారు.

              కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో  సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.

                సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని  కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో  ఇరువైపుల బంధువులు (  ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు. దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని  కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.

               ఈ సంప్రదాయం  మరో రూపంలో రసపుత్రులలో  ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.

             19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

          నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో  చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు. ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి  అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట. ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి  ప్రదేశంలో కూతురికొక్క గుడి కట్టించింది.

             ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో  అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను  సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా  లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.

               మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట  అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ (  1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ  ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు  పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి.వాస్తవాలు,విశ్వాసాలు పాలు,వీళ్లలా కలిసిపోయాయి.

             ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చార్త్రకక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలను అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published.