ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమకు ముఖ్యమైన కూడలి రావులపాలెం. దీనికి 6 కి.మీ దూరంలో ఉంది ర్యాలి. ఇక్కడి స్వామి రూపాన్ని ఇలా కీర్తిస్తారు.
ర్యాలి క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే
శ్రీ విష్ణు దివ్యరూపాయ జగన్మోహన మంగళం.
ఈ దేవాలయం లోని అనల్ప శిల్పసంపద మనల్ని చూపు తిప్పుకోనివ్వదు.దేశంలో అర్థనారీశ్వర మూర్తులున్నాయికానీ,ఇలాంటి రూపం మరెక్కడా కన్పించదు.స్వామి స్వయంభువు.అంటే మానవకల్పితం కాదు.గౌతమి , వశిష్ఠ అనే గోదావరి నదీ పాయల మధ్యలో వుందీ గ్రామం.
ఒకప్పుడు ర్యాలి ప్రాంతం దట్టమైన అడవీ ప్రాంతంగా ఉండేదట. విష్ణు భక్తుడైన అక్కడి రాజు విక్రమదేవుడు వేటకు వెళ్ళి , అలసిపోయి ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నాడట.వెంటనే నిద్ర పట్టేసిందట.కలలో శ్రీహరి కన్పించి,నేనిక్కడ స్వయంభూ రూపంలో ఉన్నాను. నగరానికి వెళ్లి , చెక్కతో రథం చేయించి ,లాక్కొని వెళ్ళు.ఎక్కడైతే రథశీల రాలిపోతుందో,అక్కడ తవ్వించు. ఓ విగ్రహం దొరుకుతుంది. దాన్ని అక్కడే ప్రతిష్టించి , ఆలయం కట్టించు అని ఆజ్ఞాపించాడు.అలాగే చేసాడు విక్రమదేవుడు.రథశీల రాలినందుకు ర్యాలి అనే పేరు వచ్చిందట. అంతకుముందు దానిపేరు రత్నాపురం , కానీ నాటినుండి ర్యాలి అనే పేరే స్థిరపడిపోయింది.
క్షీరసాగర మథనం తర్వాత దేవతలు అమృతం తాగడం వలన రాక్షసులు ఎంతకాలం యుధ్దం చేసినా గెలవలేదు. జగన్మోహినిగా మారిన శ్రీహరి అమృతం పంచేటప్పుడు దేవతలకు పురుషునిగా , రాక్షసులకు మోహినీ రూపంలో కన్పించినాడట. అదే జగన్మోహిన కేశవస్వామి రూపం.క్రీశ 11 వ శతాబ్ది చివరలో ఈ ఆలయం కట్టినట్లు తెలుస్తుంది.
కైలాసంలో ఓ సారి నారదుడు క్శ్రీహరి జగన్మోహినీ రూపాన్ని గొప్పగా వర్ణించడంతో ఆ రూపం చూడాలని వెంటబడ్డాడు శంకరుడు. విష్ణుమాయ అని కొంతసేపటికి గ్రహించాడు.ఆ సమయంలో మోహిని వేణి నుండి ఓ చామంతి పూవు నేలపై రాలింది. అందువల్లే ఈ ప్రాంతానికి ర్యాలి అనే పేరు వచ్చిందని మరికొందరంటారు. పట్టుకోవాలని ప్రయత్నించగానే మాయమయ్యింది ఆ రూపం. శంకరుడు వెనక్కి తిరిగి చూడగా అపురూపంగా జగన్మోహిని వెనుక భాగాన్ని మోహినిగానే ఉంచుతూ, ముందుభాగాన్ని మాత్రం జగన్మోహన కేశవ రూపంగా ప్రత్యక్షమయ్యింది.
ఈ గ్రామంలో విష్ణ్వాలయం తూర్పు ముఖంగా శివాలయంపడమర ముఖంగా ఉన్నాయి.ఒక దేవాలయం లోని నందాదీపం మరొక దేవాలయంలో కనబడడం అసాధారణ విషయం.ఇది ర్యాలిలో మాత్రమే ఉన్నవిశేషం. ఇది ఐదడుగుల ఎత్తుగల సాలగ్రామశిల.ఆలయంలోని శివలింగం రుద్రాక్షల వలె గరుకు గరుకుగా ఉండడం విశేషం.కేశవాలయంలో గంగ ఊరుతుండడం ,శివాలయం లోని గంగ హరించిపోవడం ఆశ్చర్యకర విషయం.
జగన్మోహినీ కేశవస్వామి కళ్యాణం చైత్రమాసంలో జరుగుతుంది.ఇక్కడి స్వామి ట్రాన్సఫర్ల దేవుడు అని ప్రతీతి.జీవితంలో ఒక్కసారయినా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రం ర్యాలి.యాత్రికులకు వసతి సౌకర్యాలు తక్కువ.దగ్గరలో ఉన్న రావులపాలం లోనే బసచేయాల్సి ఉంటుంది.ముందు , వెనుకా ఓ అపూర్వ ,అధ్భుత సౌందర్యంతో జీవకళతో అలరారుతున్న స్వామి దర్శనం ఒక్కసారైనా చేసుకోకుంటే జీవీతం అసంపూర్తే.